పైతాన్ ఇంటర్ప్రిటర్ పరిచయం

Image
Featured Image
లక్ష్యం: 

పైతాన్ లో ప్రోగ్రాంలను వాడాలంటే, C/C++ లో లాగా ముందు కంపైల్ చేయనక్కర్లేదు. పైతాన్ ఇంటర్ప్రిటర్ సాయంతో ప్రోగ్రాంలు నడుస్తాయి. ఇందువల్ల పైతాన్ లో మిగతా యంత్రభాషల్లో వీలుపడని చక్కని సౌకర్యం ఒకటుంది - పైతాన్ ఇంటర్ప్రిటర్ తో సరాసరి ఇంటరాక్ట్ అవ్వడం. దానివల్ల ఉపయోగాలేంటో చూద్దాం.

మీ షెల్ (విండోస్ లో ఐతే కమాండ్ ప్రాంప్ట్, లినక్సు ఐతే టెర్మినల్) తెరిచి, ఉత్తి python అని కమాండ్ ఇవ్వండి. క్రింద చూపించినట్టు ">>>" కనబడుతుంది. సరదాగా ఏదైనా ప్రయత్నించాలని ఉంటే క్యాలుకులేటర్ తో మీరు ఏమేం చేయగలరో అవి ఇక్కడ చేయడానికి ప్రయత్నించండి. ఉదాహరణకి - (4*5)/(1.23*1.004).

ఈ ఇంటర్ప్రిటర్ వద్ద ఏదైనా ప్రింట్ చేయాలి అనుకుంటే, print అనే కమాండ్ ని వాడి ప్రింట్ చేయొచ్చు.

మీరు ఏదైనా ఒక కొత్త పైతాన్ లైబ్రరీ నేర్చుకోవడం మొదలుపెట్టినపుడు ఆ లైబ్రరీలో ఏమేం కమాండ్లు/ఫంక్షన్లు (ఫంక్షన్ అంటే ప్రోగ్రాం లో పదేపదే వాడుకొనే  కొన్ని సూచనలకి సమగ్ర రూపం, వీటి గురించి తరువాత చెప్పుకుందాం) ఉన్నాయో గ్రహించడానికి ఇంటర్ప్రిటర్ దగ్గర సాధన చేస్తే తేలిగ్గా ఉంటుంది. ఉదాహరణకి పైతాన్ లో ప్రతి ఒక్కరికి అవసరం పడే లైబ్రరీ 'os'. దానిలో చాల ఫంక్షన్ లు ఉంటాయి, మరి వాటి పేర్లు ఎలా తెలుసుకోవడం?  వాటిని ఎలా వాడలో ఏంటో లాంటి వివరాలు కనుక్కోవడం?

మనం ఒకసారి ఇంటర్ప్రిటర్ ని స్టార్ట్ చేసాక, అది ముగించే వరకు మధ్య ఉన్న వ్యవధిని ఒక సెషన్(session) అంటారు. పైతాన్ లో ఏ సెషన్ అయినా అత్యవసర లైబ్రరీలు మట్టుకే లోడ్ చేస్కుని ఉంటుంది. ఆ పై మనకు కావాల్సిన లైబ్రరీలు బాహాటంగా(explicit గా) లోడ్ చేస్కోవలిసిందే. ముందు ఇంటర్ప్రిటర్ వద్ద మన సెషన్ కి os లైబ్రరీ ఇంపోర్ట్ చేసుకుందాం.

 
 

ఒక లైబ్రరీ లో మాములు ఫంక్షన్ లే కాక బోల్డన్ని సెక్షన్ లు కూడా ఉంటాయి. ఇంపోర్ట్ చేస్కున్న ఈ లైబ్రరీ లో ఏమేం ఫంక్షన్ లు, సెక్షన్ లు ఉన్నాయో తెలుసుకోవడానికి dir అనే కమాండ్ కొట్టాలి. ఇక్కడ మనం తీస్కున్న లైబ్రరీ os కాబట్టి, dir(os) అని కొట్టాలి.


ఒక ఫంక్షన్ ఎలా వాడలో తెలుసుకోవాలంటే, help కమాండ్ తో తెలుసుకోవాలి. ఉదాహరణకి os లో rename అనే ఫంక్షన్ గురించి తెలుసుకుందాం.

మీరు రాస్తున్న ఏదైనా కోడ్ సరిగ్గా పని చేస్తుందో లేదో తెలుసుకోవాలి అంటే ముందు ఇక్కడ ఒక ట్రైల్ వేసి తరువాత ప్రోగ్రాం లో రాసుకుంటే తప్పులు జరగవు. పైతాన్ లో ఉన్న ఈ ఇంటర్ప్రిటర్ ఇలా చాల రకాలుగా ఉపయోగపడుతుంది. కాని పైతాన్ తో పాటు వచ్చే ఈ ఇంటర్ప్రిటర్ చాల సాదాసీదా ఇంటర్ప్రిటర్. దీనికి ఇంకా ఎన్నో ఉపయోగకరమైన విషయాలు జోడించి, SciPy అనే గ్రూప్ ipython అని ఒకటి విడుదల చేసింది. పైతాన్ కి ఆ ఇంటర్ప్రిటర్ ఇంకా బావుంటుంది. తప్పకుండా ప్రయత్నించండి.