పైతాన్ - డేటాటైపులు : మొదటి భాగం

Image
Featured Image
లక్ష్యం: 

డేటాటైపు అంటే ప్రోగ్రాం లో వాడే చరాంశపు ఉనికిలో(properties of a variable) ఒక భాగం. ఈ పాఠ్యాంశంలో ఆ వివరాలు తెలుసుకుని, పైతాన్‌లో వాటిని ఎలా వాడతారో సూచాయగా ఉదాహరణలతో, ప్రయోగాత్మకంగా నేర్చుకుందాం.

 

ముందు మనం ప్రోగ్రాం లో వాడుకకు వచ్చే కొన్ని చరాంశాలను గమనిద్దాం - విద్యార్థి మార్కుల శాతం, క్షణం నిలిచి ఉండని స్టాక్ విలువ, పేల్చే ముందు మిస్సైల్ కి నిర్దేశించే వేగం, చీటీల ఆటలో బయటికొచ్చే పేరు, సహాయ కేంద్రానికి ఫోన్ చేస్తే ఆ ఆటోమేటెడ్ యంత్రం ఇచ్చే స్పందనలు, క్రికెట్ మ్యాచ్ ఉండే తేదీలు - ఇవన్నీ ఉదాహరణలే.

వీటిని ప్రోగ్రాం లో ఎక్కడో ఒక చోట బద్రపరచాలి కదా. అలా చెయ్యాలి అంటే, వాటికి ఒక గుర్తింపు ఉండాలి కదా. ఆ గుర్తింపు కి ముఖ్యంగా రెండు భాగాలున్నాయి - ఒకటి, దాని పేరు. రెండు - దాని టైపు. సోదాహరణంగా చెప్తాను.

నా ప్రోగ్రాం లో మీ పేరు, వయసు అడిగి దాచాలి అనుకున్నాను. ఈ రెండు లైన్ లతో ఆ వివరాలు అడుగుతాను.

name = raw_input("Mee peru cheptara?: ")
age = int(raw_input("Mee vayasu?: "))
గమనిస్తే, నేను పేరు అడిగినప్పుడు, కేవలం raw_input() వాడేసి ఊరుకున్నాను. కానీ, వయసు అడిగినప్పుడు, ఆ raw_input() మొత్తాన్ని, int() తో చుట్టేశాను. ఇప్పుడు ఇందాక చెప్పుకున్న చరాంశపు ఉనికిలో భాగాలైన పేరు, టైపు గురించి విశదంగా చెప్పుకుందాం.

మన మొదటి చరాంశానికి name అనేది పేరు. దాని టైపు - "స్ట్రింగ్". రెండో చరాంశానికి age అనేది పేరు, దాని టైపు - ఇంటిజర్, అంటే సంఖ్య/అంకె. మనం దేన్నైనా స్ట్రింగ్ లోకి మార్చుకోవాలి అనుకుంటే దాన్ని str() తో చుట్టాలి, ఇంటిజర్ లోకి మార్చాలి అంటే int() తో చుట్టాలి. ఇంతకు ముందు పాఠ్యాంశంలో చెప్పినట్టు raw_input() మనం ఇచ్చే ప్రతి ఇన్పుట్ ని స్ట్రింగ్ లాగానే తీస్కుంటుంది. అందుకే మొదటి చరాంశానికి ఇన్పుట్ తీస్కున్నప్పుడు, ప్రత్యేకించి str() తో raw_input() ని చుట్టలేదు.

 

పైతాన్ లో శతకోటి డేటా టైపులున్నాయి. వాటిని వివిధ విభాగాలుగా విభజించారు. వాటి గురించి వివరంగా వచ్చే పాఠ్యాంశంలో తెలుసుకుందాం.