పైతాన్ - రంగం సిద్దం చేస్కుందాం!

Image
Featured Image
లక్ష్యం: 

ఈ పాఠ్యాంశంలో మనకు పైతాన్ ప్రోగ్రామ్లు నడవడానికి కావాల్సిన తతంగ సామాగ్రి మొత్తం సిద్దం చేస్కుందాం.

౧. పైతాన్ ఇన్స్టాల్ చేస్కోవడం
 

విండోస్ వాడేవారు: ఈ లంకెకు వెళ్లి, మీరు ఇంటెల్ సిస్టం వాడుతుంటే, Windows x86 MSI Installer ని దించుకుని ఇన్స్టాల్ చేస్కోండి. 64 బిట్ సిస్టం వాడుతుంటే, Windows AMD64 MSI Installer దించుకుని ఇన్స్టాల్ చేస్కోండి. ఇక్కడ అంతకంటే తాజా వెర్షన్ ఉంది కానీ, ఇదివరకు వాడుకలో ఉన్న కొన్ని కమాండ్లు అందులో పని చేయకపోవచ్చు.
 
లినక్సు వాడేవారు: నూటికి 99.999999 శాతం మీరు వాడే లినక్సు లో పైతాన్ ఉండే ఉంటుంది. (ఒకసారి టెర్మినల్ లో python --version అని కొట్టి చూడండి. వెర్షన్ చూపిస్తే సరే, లేదంటే ఈ క్రింది చెప్పినట్టు ఇన్స్టాల్ చేస్కోండి)
 
ఉబుంటు వాడేవారు:
sudo apt-get install python
ఫెడోరా వాడేవారు:
yum -y install python
 
౨. ఎడిటర్ ఇన్స్టాల్ చేస్కోవడం
 
పైతాన్ సిద్దం! ఇక ప్రోగ్రామ్లు రాయడానికి ఒక ఎడిటర్ కావాలి.
 
విండోస్ లో notepad++ అని ఒకటుంది, అదైతే మంచిది, మనం రాసే ప్రోగ్రాంలన్నీ రంగులతో చూపిస్తుంది, ఇండెంట్ చేస్తుంది. సాధారణ notepad తో అవి కుదరవు. notepad++ కోసం, ఈ పేజి లో npp.x.y.z.Installer.exe అని ఉన్నదాన్ని దించుకుని  ఇన్స్టాల్ చేస్కోండి.
 
లినక్సు లో vim కి ఇంకేది సాటి రాదనేది నా అభిప్రాయం. ఫెడోరా లో vim కావాల్సిన విధంగానే వస్తుంది, కానీ, ఉబుంటు లో, మరీ అస్థిపంజరంలా ఉంటుంది. vim వాడాలనుకునే వాళ్ళు, ఈ క్రింది కమాండ్ తో vim పూర్తి ప్యాకేజ్ పొందవచ్చు. మీకు టెర్మినల్‌ పడకపోతే, gedit కాని, kate కాని వాడుకోవచ్చు. 
sudo apt-get install vim
 

3. పైతాన్‌ ఇంటర్పిట్రర్ కోసం ఒక షెల్

విండోస్ లో ఉన్న కమాండ్ ప్రొంప్ట్, లినక్సులో ఉన్న బాష్ షెల్ దీనికి సరిపోతాయి. విండోస్ లో ఒక పైతాన్‌ ప్రోగ్రాంని ఎగ్జిక్యూట్ చేయాలంటే, Win+r కొట్టి, cmd అని కమాండ్ ఇస్తే, కమాండ్ ప్రాంప్ట్ తెరుచుకుంటుంది. అందులో క్రింది కమాండ్ ఇస్తే ప్రోగ్రాం రన్‌ అవుతుంది.

python <file-name.py>

<file-name.py> ని మీ ప్రోగ్రాం ఉన్న ఫైల్ పేరుతో మార్చాలి. దారి మొత్తం కూడా ఇవ్వాలి సుమా! అంటే, అది C:\Users\Gopal\Desktop\techsetu\sample.py లో ఉంటే, ఆ మొత్తం పేరు ఇవ్వాలి. ఉత్తి sample.py ఇస్తే సరిపోదు. ఒకవేళ మీరు C:\Users\Gopal\Desktop\techsetu లో ఉంటే ఉత్తిపేరు మాత్రమే ఇచ్చినా పర్వాలేదు.

లినక్సులో, బ్రహ్మాండమైన బాష్(BASH) షెల్ ఉండనే ఉంది. దాన్ని రన్‌ చేయడానికి gnome-terminal, konsole ఉన్నాయి. మీరు గ్నోమ్‌ లో ఉండుంటే, Alt+F2 కొట్టి gnome-terminal అని ఇచ్చి, రన్‌ చేయండి. కే.డి.యీ లో ఉంటే, Alt+F2 కొట్టి, konsole అని ఇచ్చి, రన్‌ చేయండి. మీ డీ-ఫాల్ట్ షెల్ బాష్ యే ఉంటుంది కాబట్టి, ప్రత్యేకించి దాన్ని మళ్ళీ రన్‌ చేయక్కర్లేదు. ఇందులో పైతాన్‌ ప్రోగ్రాంని రన్‌ చేయడానికి క్రింద కమాండ్ చూడండి.

python <file-name.py>

<file-name.py> ని మీ ప్రోగ్రాం ఉన్న ఫైల్ పేరుతో మార్చాలి. దారి మొత్తం కూడా ఇవ్వాలి సుమా! అంటే, అది /home/gopal/techsetu/sample.py లో ఉంటే, ఆ మొత్తం పేరు ఇవ్వాలి. ఉత్తి sample.py ఇస్తే సరిపోదు. ఒకవేళ మీరు /home/gopal/techsetu లో ఉంటే ఉత్తిపేరు మాత్రమే ఇచ్చినా పర్వాలేదు.

ఇక విండోస్, లినక్సు లలో మన రంగం సిద్దం ఐనట్టే! వచ్చే పాఠ్యాంశం నుంచి ప్రోగ్రామ్లు రాయడం మొదలు పెడదాం! 

 

వ్యాఖ్యలు

ఒక అద్భుత ప్రయోగం.

ఒక అద్భుత ప్రయోగం. ప్రోగ్రామింగ్ చేయాలనే కోరికగలవారికి ఇదెంతో ఉపయోగకరం.

కొత్త వ్యాఖ్య వ్రాయి

ఈ వివరాలు గోప్యంగా ఉంచుతాం. సైటులో చూపించం.