VLC మీడియా ప్లేయర్ తో ఇంకా ఏమేమి చేయొచ్చు?

Image
Featured Image
లక్ష్యం: 

సినిమా చూస్తుంటాం, వీడియోకి ఆడియోకి మధ్య సంధి కుదరక చూడటానికి విసుగొస్తుంది! మధ్యలో ఒక నచ్చిన సీనో పాటో వస్తుంది, అది కట్ చేస్కుని విడిగా పెట్టుకుందామంటే ఎలాగో తెలియదాయె! ఒక పాత సినిమా చూస్తుంటాం, దానికి కాస్త కలర్ అద్ది ఎలా ఉందో చూసి మురిసిపోవాలన్న ఆశ ఉంటుంది, దానికి ఏమేమి కావాలో అని ఆగిపోతాం. ఇలాంటివన్నీ ఒక మామూలు ప్లేయర్ తో చేసెయ్యొచ్చు అంటే, నమ్మి నేర్చుకోకుండా ఎలా ఉంటాం?

VLC ఒక సాధారణ మీడియా ప్లేయర్ కంటే చాలా ఎక్కువే! అది వాడటం తెలియక చాలామంది వాళ్లకి కావాల్సిన కొన్ని పనులు చేయడానికి ఏవేవో సాఫ్ట్వేర్లు వెతుకుతూ కాలయాపన చేస్తుంటారు. ఈ పాఠ్యాంశంలో VLC ని ఎంత బాగా ఉపయోగించుకోవచ్చో చూద్దాం. ఇందులో మీరు VLC 1.0 లేదా ఆ పై వెర్షన్ ను వాడుతున్నట్టు పరిగణిస్తున్నాం.

౧. వీడియో కి ఆడియో కి మధ్య సంధి.

ఈ క్రింది బొమ్మలో చూపించినట్టు Tools లో  Track Synchronization అనే ఆప్షన్ ని ఎంచుకుంటే ఒక విండో వస్తుంది.

ఆ విండో ఈ క్రింది బొమ్మలో చూపించినట్టు ఉంటుంది.

ఇక్కడ, ఒకవేళ వీడియో, ఆడియో కన్నా ముందు వస్తున్నట్టైతే, Advance of audio over video అన్నదాన్ని అక్కడ ఉన్న అంకె కన్నా పెద్దది చేసి పెట్టండి. అలా ఆడియో, వీడియో సమన్వయము కుదిరే వరకు చేయండి. అదే ఒకవేళ ఆడియో, వీడియో కన్నా ముందు వస్తున్నట్టైతే, ఆ అంకెను చిన్నదిగా చెయ్యండి. నెగటివ్ అంకె లాగా ఇవ్వాల్సి ఉండొచ్చు. అలా సమన్వయము కుదిరే వరకు చేయాలి.

౨. నచ్చిన క్లిప్పింగులు కట్ చేసి సేవ్ చేసుకోవడం.

ఈ క్రింది బొమ్మలో చూపించినట్టు View లో  Advanced Controls అనే ఆప్షన్ ని ఎంచుకుంటే మెయిన్ విండో లో మూడు అదనపు బటన్ లు చేరతాయి.

ఇప్పుడు మనకు కావాల్సిన క్లిప్ మొదలవ్వల్సిన చోట ఆపి(pause చేసి), ఈ క్రింద చూపించినట్టు, అక్కడ ఎర్రగా ఉన్న రికార్డు బటన్ ని నొక్కాలి. ఇప్పుడు మళ్ళీ ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు ఆడనిచ్చి, మళ్ళి ఆ ఎర్ర రికార్డు బటన్ నే నొక్కాలి. ఇప్పుడు ఆ రికార్డు అయ్యింది My Documents లో బద్రపరచబడుతుంది.

౩. వీడియో కలర్ తో, సైజు తో ఆటలు

ఈ క్రింది బొమ్మలో చూపించినట్టు Tools లో Effects and Filters అనే ఆప్షన్ ని ఎంచుకుంటే ఒక విండో వస్తుంది. అక్కడ చాలా ఆప్షన్ లు ఉంటాయి. అన్నీ ఇక్కడ చెప్పడం వీలుకాదు, కాబట్టి ఏమేమి చేయొచ్చో మాత్రం చెప్తాను, కుదిరిన చోటల్లా బొమ్మలు చూపిస్తూ.

మనం పాత నలుపు-తెలుపు సినిమాలు చూస్తున్నప్పుడు, దాన్ని ఏదో ఒక కలర్ టింట్ లో చూడాలన్న కోరిక పుడుతుంది, ఉదాహరణకి కౌబోయ్ సినిమా టైపు లో కాస్త కాఫీ కలర్ అద్ది చూడాలి అనుకుందాం, ఎలాగో చూద్దాం. ఆ Effects and Filters విండోలో, Basic లో, image adjust ని టిక్ చేసి, అక్కడ Hue ని మనకు కావాల్సిన రంగు వచ్చేదాకా కదిపి సరిచేసుకుంటాం. తర్వాత, ఆ రంగు కాస్త ముదురుగానో, పలచగానో కావాలనుకుంటే, Saturation ని సరిచేసుకోవాలి. అంతే!  తేడా చూడటానికి ఈ క్రింది బొమ్మలు చూడండి.

ఒరిజినల్‌ వీడియో

మార్చిన తర్వాతి వీడియో

కొన్ని సినిమాలు క్రింద, పైన నల్లని స్కోప్ తో వస్తాయి. కొందరికి అవి ఇష్టం ఉండవు. వీడియోని సాగదీసినట్టు ఉంటుంది. వాటిని తీసేసి చూడాలి అనుకుంటే, ఆ విండో లో, Crop అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే, ఏ వైపు ఎంత కట్ చేయాలో చెప్పే ఆప్షన్ లు ఉంటాయి. ఒకవేళ క్రింద పైన ఒకటే సైజు లో కట్ చేయాల్సి ఉంటే, అక్కడే ఉన్న Synchronize top and bottom ని టిక్ చేస్తే top లేదా bottom లో మాత్రం ఎంత తీసెయ్యాలో చెప్తే సరిపోతుంది. అలా చేశాక, ఇప్పుడు,  VLC మెయిన్ విండోలో, Video లో Aspect ratio లో ఏది ఎంచుకుంటే మీకు వీడియో బాగా కనిపిస్తుందో చూసి అది ఎంచుకోండి. ఇప్పుడు వీడియో మీకు నచ్చిన విధంగా చూసుకోవచ్చు.

ఇంకా వీడియో ని అటు ఇటు తిప్పడం, నాయిస్ కలపడం లాంటివి చెయ్యొచ్చు. ఇవి అందరికి కాదుగాని, కొన్ని పనులకి బాగా ఉపయోగపడతాయి, ఉదాహరణకి ఒక వీడియో తాయారు చేసేటప్పుడు ఒక చోట ఇలాంటి ఎఫ్ఫెక్ట్ పెట్టాలి అనుకుంటే ఇది అక్కరకొస్తుంది.

౪. CD/DVD ప్లే చేయడం.

చాలా తేలిక! CD/DVD మీ కంప్యూటర్ DVD డ్రైవ్ లో పెట్టి, ఈ క్రింది బొమ్మలో చూపినట్టు VLC మెయిన్ విండోలో Media లో Open Disc అని కొడితే సరి! ఒక్కోసారి, అది ఏ రకమైన డిస్కో అడుగుతుంది. CD/DVD/VCD అని.

౫. వెబ్ కెమెరా తో, మైక్రోఫోన్ తో లేదా మీ డెస్క్టాపునే రికార్డు చేయడం

VLC మెయిన్ విండోలో Media లో Open Capture Device అని కొడితే, అక్కడ దేని ద్వారా రికార్డు చేయొచ్చో ఎంచుకోవడానికి వీలుంటుంది.

క్రింద చూపించిన విండోలో చూపించినట్టు, ఒకవేళ వెబ్ కెమెరా, మైక్రోఫోన్ తో రికార్డు చేసి సేవ్ చేస్కోవాలి అనుకుంటే, Capture mode ని Directshow గా ఎంచుకుని, మీ వెబ్ కెమెరా, మైక్రోఫోన్ వివరాలు (Default పని చేయాలి, లేకపొతే తగిన వివరాలు ఇవ్వాలి) ఇవ్వండి. ఒకవేళ మీ డెస్క్టాపుని రికార్డు చేద్దాం అనుకుంటే, Capture mode ని Desktop గా ఎంచుకోవాలి.

ఇప్పుడు ఆ రికార్డు అయ్యేది సేవ్ చేయాలి అంటే, ఈ విండోలో, క్రింద Play కి ఎడమవైపున బాణం గుర్తు ఉంటుంది. అది నొక్కితే, Enqueue, Play, Stream, Convert అని ఉంటాయి, బొమ్మలో చూపినట్టు. అందులో Convert అని ఎంచుకోండి. ఆ తర్వాత వచ్చే విండోలో ఈ పాఠ్యాంశంలో చెప్పిన విధంగా చేస్తే, మీరు విజయవంతంగా రికార్డుచేస్కోవచ్చు. ఏ వీడియో ఫార్మాట్ ఎంచుకోవాలి అని తెలుసుకునేందుకు, ఈ స్లైడ్‌షో చూడండి.

ఇంకా VLC ని చాలా, చాలా వాటికి వాడొచ్చు. అన్నీ ఇక్కడ రాయడం కుదరదు. ఒక్కసారి ఆ మెనూల్లో ఉన్న ఆప్షన్లన్నీ పరిశీలించండి. మీరు కలలో కూడా అనుకోనివి కూడా చెయ్యొచ్చని తెలుస్తుంది. అన్వేషణ మొదలుపెట్టండి మరి :)